శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9: హెచ్‌సీయూ భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీసుల ఎదుట మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌తో కలిసి బీఆర్ఎస్ ఐటీ సెల్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన వారిని పోలీసులు సుమారు 9 గంటలపాటు విచారించారు. విచారణ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తడుముకోకుండా దీటుగా సమాధానాలు ఇచ్చారు. విచారణ అనంతరం మన్నె క్రిశాంక్ పలు విషయాలను వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ వర్సిటీ భూముల్లో జింకలే లేవన్నారని, కానీ, జింకలు ఉన్నాయన్న విషయం దేశమంతా తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఆ పోస్టులు పెట్టామని చెప్పినట్టు తెలిపారు. రీట్వీట్ చేసినా నేరంగానే పరిగణిస్తే ఎలా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూముల్లో జరిగిన అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే తమపై కేసులు పెట్టారని చెప్పారు. పోలీస్ శాఖ కూడా ఏదైనా మంచి చేస్తే తప్పకుండా రీట్వీట్ చేస్తామని తాము బదులిచ్చామని, ఇది కూడా నేరమవుతుందా? అని క్రిశాంక్ ప్రశ్నించారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తాము విచారణకు హాజరయ్యామని, రాత్రి వరకు గంటల తరబడి కూర్చోబెట్టి రికార్డ్ చేస్తూ కాలయాపన చేసినా ఒపికగా సమాధానాలు ఇచ్చామని చెప్పారు. దిలీప్, క్రిశాంక్లను పోలీసులు విచారించడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. 9 గంటలపాటు ప్రజాపాలనేనా? అని ఆయన ప్రశ్నించారు.