హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీటి వనరుల వినియోగం, కేటాయింపుల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన దార్శనికతను కేంద్రం విస్మరించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. దేశంలో సహజ వనరుల వినియోగం ప్రత్యేకించి నదీ జలాలు, విద్యుత్ వినియోగం విషయంలో దశాబ్దాలుగా రాష్ర్టాల మధ్య, రాష్ర్టాల్లోని ప్రాంతాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా 1.40 లక్షల టీఎంసీల వర్షం కురిస్తే అందులో సగం ఆవిరైపోతుందని, మిగిలినదాంట్లో 50 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, మిగిలిన 20 వేల టీఎంసీలను మాత్రమే వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. నదీజలాల పంపిణీ, వివాదాలను పరిష్కరించటంలో ట్రిబ్యునళ్లు సకాలంలో స్పందించటం లేదని మండిపడ్డారు. నీటి పంపిణీ విషయంలో రాష్ర్టాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్లు తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించకపోగా కొత్త అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ వినియోగంలోనూ ప్రభుత్వాలు మేల్కొవాల్సిన అవసరం ఉందని సూచించారు.
అందుబాటులో ఉన్న నదీ జలాల వినియోగంలో దేశానికి తెలంగాణను రోల్‌మాడల్‌గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలిపారని కేఆర్ సురేశ్‌రెడ్డి కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి ఒకప్పుడు కరువుగా కేరాఫ్‌గా ఉన్న తెలంగాణను సిరుల నేలగా మార్చారని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై కోర్టులను ఆశ్రయించే పరిస్థితి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొంటూనే పార్లమెంట్ చేసిన చట్టాలను నిర్వీర్యం చేసే పరిస్థితులు రావడం వ్యవస్థ దయనీయస్థితికి నిదర్శనమని ఆవేదన వ్య క్తం చేశారు. ఈ దురవస్థ ఎందుకొచ్చిందో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ విషయమై పార్లమెంట్ కమిటీ వేయాలని, ఆ కమిటీ సూచనల మేర కు చట్టసవరణ చేసి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.