హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి వేధింపులతో కూడిన సంకుచిత రాజకీయాలు చేస్తున్నారని శాసనసభలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసే కుసంస్కారం రేవంత్‌రెడ్డిదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి పోనీయకుండా ఉండేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.
ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ ఉంటారని తెలిసి కూడా సిట్ అధికారులతో కావాలనే నందినగర్‌లో నోటీసులు ఇప్పించారని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్‌లో నోటీసులు ఎలా ఇచ్చారని సీపీ సజ్జనార్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు కీలుబొమ్మగా మారారని, లైన్ దాడి పనిచేస్తున్నారని మండిపడ్డారు. సిట్ అధికారులు దొంగల్లా అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.