aకుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో గురువారం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ వివాదానికి దారి తీసింది. ముఖ్య అథితిగా హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
టేబుల్పైనున్న వాటర్ బాటిల్, ఇతర వస్తువులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్పై విసిరికొట్టారు. కాంగ్రెస్ నాయకులు కోవ లక్ష్మి దగ్గరికి ఆవేశంగా రావడంతో అధికారులు, పోలీసులు వారించారు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ దయతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేఖాశ్యాంనాయక్ కనీస కృతజ్ఞత లేకుండా కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదన్నారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా శ్యాంనాయక్ భార్య రేఖానాయక్ కేసీఆర్ దయతోనే గెలిచారని గుర్తుచేశారు. ఎంవీఐగా పనిచేసిన శ్యాంనాయక్ వాహనదారులను పీడించారని, ఇలాంటి వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ప్రజలు ఇబ్బందులు పడుతారని తెలిపారు. ఎక్కడినుంచో వచ్చిన శ్యాంనాయక్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆదివాసీలపై పెత్తనం చేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరుగలేదని, రేషన్ కార్డులు ఇవ్వలేదని అధికారులతోనే కాంగ్రెస్ నాయకులు అబద్ధ్దాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు.