దుబ్బాక, మార్చి 16 : కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివారం అఖిల్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించడం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గురుకుల పాఠశాలను సందర్శించి తరగతి గదులు, డార్మెటరీ, బాత్రూమ్లను ఆయన పరిశీలించారు. 7వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. అఖిల్ ఆత్మహత్య యత్నానికి గల కారణాలు, గురుకులంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో గురుకుల, వసతి గృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. నిలోఫర్‌లో అఖిల్‌కు అందుతున్న వైద్యంపై సంబంధిత వైద్యులతో శనివారం నుంచి ఎప్పడికప్పుడు మాట్లాడి తెలుసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. హబ్షీపూర్ వసతిగృహం కారాగారంగా ఉందని సిబ్బందిపై మండిపడ్డారు.