రాజన్న సిరిసిల్ల, మార్చి 22 : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ డా. ఎన్. సత్యనారాయణ అన్నారు. మంగళవారం రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంచాలకులు కె. విద్యాధర్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ ఈఎన్సీ ఆర్. శ్రీధర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి కొత్త చెరువు సుందరీకరణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త చెరువును మినీ ట్యాoక్ బండ్‌గా సుందరీకరణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1.2 కి.మీ. మేర బండ్ నిర్మాణం, 4 ఎకరాల్లో ఆట వస్తువులు, గ్రీనరీ, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. బోటింగ్ అందుబాటులోకి తేవాలన్నారు. పట్టణ ప్రజలకు ఈ ప్రదేశం మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తుందని, ప్రజలు ఉల్లాసంగా గడపడానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ, ఈఈ సుచరణ్, ఏఈ వరుణ్, తదితరులు పాల్గొన్నారు.