హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో ఇప్పటికే ఒక కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీసింది. మరో 10 కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలే కాగా, వీటిని ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. ప్రతిపాదిత కాలేజీలన్నీ గతంలో సెకండ్షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజీలే కావడం గమనార్హం. ఈ కాలేజీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పాలిటెక్నిక్ తరగతులు నిర్వహించేవారు. అడ్మిషన్లు కూడా వేర్వేరుగా ఉండేవి. అయితే ఈ కాలేజీల్లో రెండోషిప్ట్‌ను రద్దుచేసి, ఈ కాలేజీలను రోజంతా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కాలేజీల్లో ఇన్‌టెక్ అలాగే ఉండగా, ఫ్యాకల్టీ ఆయా కాలేజీల్లోనే పనిచేస్తున్నారు. ఈ కాలేజీల్లో అధునాతన ల్యాబ్‌లున్నాయి. పీహెచ్డీ అర్హత ఉన్న ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ఒక్క ఇంజినీరింగ్ కాలేజీకి సరిపోయే భవనాలను కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వీటిల్లో పాలిటెక్నిక్ కోర్సులతో పాటు, ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహిస్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి ప్రభుత్వ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరైంది. కోస్గిలో నడుస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ కాలేజీగా అప్‌గ్రేడ్‌చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇది రాష్ట్రంలోని తొలి మహిళా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ కావడం గమనార్హం.2024 -25 విద్యాసంవత్సరం నుంచి ఈ కాలేజీని ప్రారంభించనున్నారు. ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (ఏఐఎంఎల్), కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (డాటాసైన్స్ ) కోర్సులను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.