నారాయణపేట (కోస్గి), జూలై 12: సీఎం ఇలాకాలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత శాసం రామకృష్ణ కొడుకు అస్వస్థతకు గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది ఎవరూ బాలుడిని పరీక్షించలేదు. వాచ్మన్ మాత్రం స్లైన్ ఎక్కించాడు. వైద్యు లు ఎవరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన రామకృష్ణ.. కుమారుడిని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాడు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు వెంకటనర్సింహులు, హన్మంత్, తాయప్పతోపాటు పలువురితో దవాఖానకు చేరుకొని బైఠాయించారు. రెండు గంటల ఆందోళన చేపట్టగా దవాఖాన ఇన్చార్జి డాక్టర్ అనుదీప్ వచ్చి విషయం తెలుసుకొని నైట్డ్యూటీలో ఉన్న డాక్టర్, నర్సులు, సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రామకృష్ణ ఆందోళన విరమించాడు. కార్యక్రమంలో నాయకులు చైతన్య, వెంకటేశ్ పాల్గొన్నారు.