Korutla Murder case | కోరుట్ల చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఐదేళ్ల చిన్నారి ఆకుల హితీక్షని చంపింది చిన్నమ్మ మమతగా పోలీసులు గుర్తించారు. తోడికోడలిపై కోపంతో ఐదేళ్ల చిన్నారి హితీక్షని మమత చంపిందని తేలింది. దాంతో నిందితురాలు మమతను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల జిల్లా కోర్టుకు చెందిన ఆకుల హితీక్ష అనే చిన్నారి పిన్ని మమత చేతిలో హతమైంది. చిన్నారి హితీక్ష తల్లిదండ్రులపై కోపంతో చిన్నారిని బలి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. హితీక్ష హత్య అనంతరం పోలీసులు పిన్ని మమతను అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితురాలు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నది. ఆన్లైన్ బెట్టింగ్తో రూ.లక్షలు పోగొట్టుకుంది. ఓ వైపు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడం.. మరో వైపు చిన్నారి తండ్రి సంపాదనపై అసూయ, తల్లి నుంచి చిన్నచూపు చూడడంతో వారిపై కక్ష పెంచుకొని బాలికను పక్కింట్లోని బాత్రూంలో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
హితీక్ష హత్య అనంతరం మమత తాను కట్టుకున్న చీరను మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఇంట్లో నుంచి ఓ కవర్ పట్టుకొని బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్యకు వినియోగించిన కత్తి, హత్య సమయంలో నిందితురాలు కట్టుకున్న చీరను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మమత పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. హత్య అనంతరం ఆటోలో సంఘటనా స్థలం నుంచి కిలోమీటర్ దూరం వెళ్లి జీఎస్ గార్డెన్ సమీపంలోని వీధిలో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న చీరను పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలిని సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితురాలు మమతను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, మమతకు ఇద్దరు కూళ్లు ఉన్నారు. తల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో తాత, హితీక్ష తండ్రి చేరదీయడం గమనార్హం. నిందితురాలి భర్త ఉపాధి కోసం సౌదీకి వెళ్లినట్లు సమాచారం.