హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): హెల్దీ పీపుల్స్తోనే హెల్దీ రాష్ట్రం సాధ్యమవుతుందని, వైద్య ఆరోగ్యరంగం ప్రాధ్యాన్యాన్ని గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచించారు. తాజా బడ్జెట్లో వైద్యఆరోగ్య రంగానికి కేవలం 2% నిధులే కేటాయించడం తగదని తెలిపారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు 30 శాతమే జరిగేవని, కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టిన తర్వాత డెలివరీలు 70 శాతానికి చేరాయని చెప్పారు. మాతాశిశు మరణాల రేటు నాడు 11.12 నుంచి 3 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. నాడు వ్యక్తిని యూనిట్‌గా తీసుకొని కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు జరిపారని, తద్వారా సత్ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖాన నిర్మాణం ఆగిపోయిందని, 15 నెలలుగా ఒక్క ఇటుక కూడా కొత్త ప్రభుత్వం పేర్చలేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తన ఇంటికి ఎదురుగా ఉన్న మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో ప్రతినెలా 200 డెలివరీలు అయితే, గత నెలలో 50 డెలివరీలే అయ్యాయని గుర్తుచేశారు.
రైతుకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు: కాటిపల్లి
వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు ఏమి కావాలో తెలుసుకొని నకిలీ విత్తనాలు అమ్మకుండా సీడ్‌కు ఇన్సూరెన్స్ కల్పించాలని సూచించా రు. అసెంబ్లీలో శనివారం పద్దులపై చర్చలో ఆయన మాట్లాడారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీల వెంట ఉండే డ్రైవర్లు, గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది విశ్రాంతికి అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వసతి సదుపాయం కల్పించాలని కోరారు.
పాముకాటుకు మందుల్లేవు: కూనంనేని
రాష్ట్రంలోని అనేక దవాఖాన ల్లో పాముకాటుకు కూ డా మందులు లేవని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు ప్రమాదం జరిగి, పాముకాటుకు గురై దవాఖానకు వెళ్తే అందుబాటులో వైద్యులు ఉండటం లేదని చెప్పారు. సాధారణ మందులు కూడా దవాఖానల్లో ఉండటం లేదని, తమ వద్దకు చికి త్స కోసం వచ్చేవారిని అంతకంటే చిన్న ప్రైవే టు దవాఖానలకు పంపుతున్నారని ఆరోపించారు.