ఖైరతాబాద్, జూన్ 22: లంబాడీల ఓట్లతో గెలిచి.. ఆ జాతిని మోసం చేసి.. తిరిగి తాజాగా బస్సు యాత్ర పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థానక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు 12 హామీలు ఇచ్చారని, 30నెలలు గడస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఆ పార్టీలోని నలుగురు లంబాడీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్సీ నోరు మూగబోయిందని విమర్శించారు. ఎంపీ బలరాంనాయక్ వయస్సు అయిపోయిందని, ఆయన ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాలూనాయక్, రాంచందర్‌నాయక్, రాందాస్‌నాయక్, మురళీనాయక్‌కు కాంగ్రెస్ పార్టీలోని అగ్రకుల నాయకులను అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.
లంబాడీలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని, లగచర్లలో గిరిజనులపై దాడి చేశారని మండిపడ్డారు. నేడు లంబాడీల బస్సు యాత్ర పేరుతో వస్తున్న కాంగ్రెస్ పార్టీలోని బంజారా ప్రజాప్రతినిధులు ఏ ముఖం పెట్టుకొని ఈ కా ర్యక్రమాన్ని చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ సర్వనాశమవుతుందని అన్నారు. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పులదండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలూనాయక్, సేవాలాల్ బంజారా సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి గణేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.