పెద్దపల్లి కమాన్, ఆగస్టు 9: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతులను అరిగోసపెడుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజుకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని, ఇప్పటికే 600 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
వర్షాలు పడకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నాయనే భరోసాతోనే రైతులు పంటలు వేసుకున్నారని, తీరా సమయానికి వర్షాభావ పరిస్థితులు నెలకొడం, ప్రాజెక్టు నుంచి విడుదల చేయకపోవడంతో సాగు ప్రశ్నార్థకమైందని తెలిపారు. ఎస్సారెస్పీ ఫేజ్-1లో 9.65 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2.34 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిందని, మిగతా 7.3లక్షల ఎకరాల పంటలను ఎండబెట్టేందుకు సర్కారు కంకణం కట్టుకున్నదని విమర్శించారు.
ఫేజ్-2లో నీటి విడుదలపై ఊసేలేదని, ప్రభుత్వాన్ని నమ్ముకుని లక్షలాది ఎకరాల్లో నాట్లు వేసుకున్న రైతులు పంటలను ఎలా కాపాడుకోవాలో..? తెలియక అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. 2022లో రెండు పంటలకు 24,30,753 ఎకరాలకు సాగునీరందించి ఎస్సారెస్పీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైందని గుర్తుచేశారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే భాగ్యం లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులో 55 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, వీటితో ఎన్ని చెరువులు, రిజర్వాయర్లు నింపుతారో రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు 22 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ర్టానికి ఇచ్చామని కేంద్ర మంత్రి చెప్పారని, కానీ రాష్ట్రంలో 9లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే 4 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చారని, మిగతా 5లక్షల మెట్రిక్ టన్నులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ముందు చూపుతో సాగునీరు, ఎరువులు, విద్యుత్తు సమస్యలు పరిష్కరించి, సమయానికి పెట్టుబడి సాయం ఇచ్చి రైతులను అన్ని విధాలా ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసి పంటలను రక్షించాలని, లేదంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.