ఖైరతాబాద్, అక్టోబర్ 27: ‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భయపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ఆయన విసిరిన సవాల్నే తాను స్వీకరించి చర్చలకు వస్తే మంత్రి ముఖం చాటేశారు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధు, కోరుకంటి చందర్, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం ఆయన వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు కొప్పుల సహా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా మంత్రితో చర్చించేందుకు వచ్చామని, తమను అనుమతించాలంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బలవంతంగా కొప్పుల సహా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన ప్రగతిపై చర్చ కోసం మంత్రి లక్ష్మణ్ సవాల్ విరిసితేనే తాను అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చానని చెప్పారు. తీరా అక్కడికి మంత్రి రాకపోవడంపై మండిపడ్డారు. సవాల్ విసిరిన మంత్రి.. చర్చలకు తాను సిద్ధపడ్డాక భయపడ్డారని చెప్పారు. మంత్రి సవాల్నే స్వీకరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు తాము వస్తే అక్రమంగా అరెస్టు చేయడం అక్రమమని విమర్శించారు. మాటపై నిలబడి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో చర్చించేందుకు సిద్ధపడి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా కొప్పులపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం బాధాకరమని తప్పుబట్టారు. చర్చకు రావాలని సవాల్ విసిరి ముఖం చాటేసిన మంత్రి లక్ష్మణ్ తీరు సిగ్గుచేటని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని, అరెస్టును ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని కోరారు.