కరీంనగర్ : తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు వచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) ఆరోపించారు. ఆదివారం కరీంనగర్(Karimnagar)లోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించకుండా రాష్ట్ర పర్యటనకు ఎలా వచ్చారని ప్రశ్నించారు.
విభజన చట్టంలో బయ్యారం ఉక్కు (Bayyaram Steel ) పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ( Coach Factory ) , గిరిజన యూనివర్సిటీతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram ) కు జాతీయ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రధానిదేనని అన్నారు. రూ.20 వేల కోట్లతో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఇక్కడి 10 వేల మంది యువతకు ఉపాధి లభించేదని పేర్కొన్నారు. కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ( Narendra Modi ) గుజరాత్ తరలించారని మండిపడ్డారు. రూ. 500 కోట్లతో పనులు ప్రారంభమై నడుస్తున్న వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని అభివృద్ధి పేరుతో ప్రారంభించారని ఎద్దేవా చేశారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని తెలిసి ప్రజలను మభ్యపెట్టడానికే రూ.6 వేల కోట్ల పనులు ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్న మోదీ తెలంగాణకు తొమిదేండ్లలో ఎన్ని కోట్లు మంజురు చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు. దోచుకున్న సొమ్ముతో ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి కృతిమ బలంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నారని మండిపడ్డారు. ఏడు రాష్ర్టాల్లో అధికారం కోల్పోవడంతో మోదీ ముఖంలో ఓటమి భయం కనబడుతుందన్నారు. బీజేపీ అరాచకాలను అడ్డుకోవడం కోసం పోరాటాలను కొనసాగిస్తామన్నారు.
మతోన్మాద పార్టీ బీజేపీని కేంద్రంలో గద్దె దింపడానికి లౌకిక పార్టీలు ఒకే వేదిక మీదకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కార్యదర్శులు పవన్, వేణు, సదానందం, సురేశ్, నగరం కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.