హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తనను క్యాబినెట్ నుంచి అర్ధాంతరంగా బయటకు పంపడంపై మాజీ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. ప్రభుత్వంలో ఉన్నంతకాలం తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నా ఇంతటి దారుణమైన చర్యకు పాల్పడటం రేవంత్ అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు తాను రాజ్యాంగబద్ధంగా, పార్టీ నిబంధనల మేరకు వివరణ ఇచ్చినా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేవలం తన కుటుంబంపై ఉన్న పాత కక్షతోనే రేవంత్‌రెడ్డి ఈ నాటకానికి తెరతీశారని, తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తన మంత్రి పదవిని ఎలా ఊడగొడుతారని నిలదీశారు. కనీస సంప్రదింపులు జరుపకుండా, ముందస్తు సమాచారం లేకుండా బర్తరఫ్ చేయడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, ప్రజల సమక్షంలోనే రేవంత్ అరాచక పాలనను ఎండగడుతానని ఆమె హెచ్చరించారు.
తనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, బెదిరింపులకు దిగడం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారని సురేఖ చెప్పారు. ‘మంత్రివర్గం నుంచి సురేఖను తొలగించండి. ఒకవేళ ఆమె మంత్రివర్గంలో కొనసాగితే నేను సీఎంగా ఉండను’ అంటూ రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ చేశారని వెల్లడించారు. బర్తరఫ్ చేయదగ్గ తప్పు తానేమీ చేయలేదని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ప్రభుత్వానికి నష్టం కలిగించే ఒక్క చర్యా తీసుకోలేదని, అయినా తన ను బర్తరఫ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు.
కుట్ర చేసి బర్తరఫ్
ప్రణాళిక ప్రకారం.. అదును కోసం ఎదురు చూసి ఇప్పుడు తన కూతురు ఏదో మాట్లాడిందన్న నెపంతో తనను బర్తరఫ్ చేశారని చెప్పారు. తన కూతురు సుస్మిత సొంత అభిప్రాయంతో చేసిన వ్యాఖ్యలకు తనను బలిపశువును చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీ శ్రీనివాస్ కొడుకు బీజేపీలో చేరి కాంగ్రెస్‌ను విమర్శించినప్పుడు డీ శ్రీనివాస్‌పై ఇలాగే చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది పార్టీని, సీఎంను అనేక వేదికల్లో తిట్టారని, వారెవరిపైనా చర్యలు తీసుకోకుండా కేవలం తనపైనే చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేందని ప్రశ్నించారు.
మాజీ సీఎం రోశయ్య, జైపాల్‌రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారని, ఒకప్పుడు మల్లు రవి కూడా కాంగెస్న్రు తిట్టారని గుర్తుచేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు రామసహాయం సురేందర్‌రెడ్డి కుటుంబానికి తమకు చాలాకాలం నుంచి రాజకీయ వైరం ఉన్నదని, పొంగులేటి కూడా వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తమను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎర్రబెల్లి స్వర్ణ, సారయ్య వంటివాళ్లు రామసహాయం సురేందర్‌రెడ్డికి శిష్యులని, అలాంటి వాళ్లు కూడా తమపై ఆరోపణలు చేస్తుంటారని తెలిపారు. వేం నరేందర్‌రెడ్డి సహా జిల్లాలో ఉన్న టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారు తమపై కుట్ర పన్నారని ఆరోపించారు. తానేలాంటి తప్పు చేయలేదని, జరిగినదానికి తనకేమీ పశ్చాత్తాపం లేదని కొండా వివరించారు. తన ఓఎస్డీ సుమంత్‌ను అకారణంగా కేసుల్లో ఇరికించారని, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.
బర్తరఫ్ గురించి కనీసం చెప్పరా?
ఉరిశిక్ష వేసే ముందు కూడా చివరగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అని అడుగుతారని, అలాంటిది అకస్మాత్తుగా మంత్రి పదవి తీసేయడం ఎంత వరకు సబబని సురేఖ ప్రశ్నించారు. దీనిపై సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.
పార్టీ వీడను.. ఎమ్మెల్యేగా ఉంటా
పార్టీని తాను విడిచిపెట్టబోతున్నట్టు వస్తున్న వార్తలు తప్పని సురేఖ స్పష్టంచేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అభిమానం ఉన్నదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని తెలిపారు. బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని కొట్టిపారేశారు. ఏ పార్టీ అయితే తనకు టికెట్ ఇచ్చిందో ఆ పార్టీతో వచ్చిన పదవిలోనే ఉన్నప్పుడు అదే పార్టీలో ఉంటానని, పదవి రాగానే పార్టీ మారలేదని పరోక్షంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పార్టీ మారాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు కూడా రాజీనామా చేశానని గుర్తుచేశారు. ప్రజలు, నాయకులతో సీఎంకు కమ్యూనికేషన్ సరిగ్గా లేదని అందుకే పనులేవీ కావడం లేదని చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ సంతోషంగా లేరని, సీఎం వద్ద పనులు కావడం లేదన్న బాధ అందరిలో ఉన్నదని, తమలో తాము కుమిలిపోతున్నారని, అలాంటివారు బయటకు రావాలని సురేఖ చెప్పారు. సంతోషంగా ఉన్నామని చెప్తున్నవారు తమ గుండెలపై చెయ్యివేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏకఛత్రాధిపత్యం మంచిది కాదని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి హితవు పలికారు.
బీసీ రిజర్వేషన్లు అంటూనే అన్యాయం?
బీసీ రిజర్వేషన్లు తెస్తామని గర్వంగా చెప్పుకొంటూ మరోవైపు బీసీ బిడ్డనైన తనను బర్తరఫ్ చేయడం దేనికి సంకేతమని సురేఖ ప్రశ్నించారు. తాను, తన భర్త బీసీలమని, తన పదవి తీసివేసినందుకు ఇప్పుడు ముగ్గురు బీసీ బిడ్డలకు పదవులు ఇచ్చారని, ఇది మంచిదే కానీ, మహిళగా సొంతంగా 30 ఏండ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న తనపట్ల వ్యవహరించిన తీరు సరిగాలేదని వాపోయారు.
సోనియాకు లేఖ
సీఎంవో నుంచి వస్తున్న ప్రత్యక్ష ఆదేశాలతో అటవీ, దేవాదాయ శాఖలో తన పాత్ర ఉత్సవ విగ్రహంలా మారిందని సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఆమె పది పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన నాటి నుంచే రేవంత్‌రెడ్డి తనను బీసీ మహిళననే ఉద్దేశపూర్వకం గా అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏ ర్పాటుపై తనకు సమాచారం ఇవ్వలేదని, భద్రాచలం ఉత్సవాలపై ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫొటో, పేరు లేదని, సమ్మక-సారలమ్మ ఆలయ శాశ్వత అభివృద్ధి కో సం దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేసినా వాటిని ఒక రోజులోనే ఆర్అండ్ బీకి బదిలీ చేశారని వాపోయారు.
తన కు తెలియకుండానే అటవీ శాఖలో ఐఎఫ్ఎస్ అధికారుల డిప్యుటేషన్లు రద్దు చేశారని వివరించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన పరిధి దా టి, మంత్రి అయిన తనకు సమాచారం ఇవ్వకుండానే దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారని, పార్టీ దృష్టి కి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని పే రొన్నారు. రేవంత్‌రెడ్డి పదేండ్లు సీఎంగా ఉంటానని ప్రకటించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎకడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పిన రేవంత్‌రెడ్డి, పరకాల సభలో మాత్రం రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలని కోరడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు.