హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త, బీజేపీకి సన్నిహితునిగా పేరొందిన గౌతమ్ ఆదానీతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలు రహస్యంగా భేటీ కావడం వెనుక అంతర్యం ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈడీ కేసులను మాఫీ చేసేందుకే అదానీని పొంగులేటి కలుసుకున్నారా అని అనుమానం వ్యక్తంచేశారు. దాసోజు శ్రవణ్ గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రెయిడ్స్ జరిగాయని, ఈ దాడుల్లో రూ.1600 కోట్లు దొరికినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదని అన్నారు. బంగారం కూడా పెద్దమొత్తంలో దొరికినట్టు తెలిసిందన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రెయిడ్స్ తర్వాత ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని కోరారు. ఈడీ దాడుల వివరాలను ఇంతవరకు ఎందుకు బయటపెట్టడంలేదని అనుమానం వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీని అడ్డం పెట్టుకుని ఈడీ కేసుల నుంచి బయటపడేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలు వింటే రాజకీయాల పట్ల అసహ్యం కలుగుతున్నదని అన్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణపై పరివాహక ఎమ్మెల్యేలతో మీటింగ్ ఎందుకు పెట్టలేదు’ అని ప్రశ్నించారు.