హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ పలు విషయాలను పంచుకున్నారు. కేసీఆర్‌లో ఎంతో హుందాతనం ఉంటుందని, తాము ఎప్పుడు వెళ్లినా ఆప్యాయంగా పలుకరిస్తూ మంచిగా రిసీవ్ చేసుకునేవారని తెలిపారు. తాము ఏదైనా అంశంపై ఆయన్ను కలిసినప్పుడు సానుకూలంగా స్పందించేవారని చెప్పారు.
తమ పట్ల ఆయన ఎప్పుడూ గౌరవంగా వ్యవహరించారని చెప్పారు. రాజకీయంగా భిన్న పరిస్థితులు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ కేసీఆర్ వ్యక్తిగతంగా తమతో వ్యవహరించిన తీరు హుందాగా ఉండేదని సురేఖ వ్యాఖ్యానించారు. తాము అడుగగానే కేసీఆర్ స్పందించి కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. కేసీఆర్‌లోని హుందాతనం, తమను ఆప్యాయంగా పలుకరించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేరొన్నారు. రాజకీయంగా ఎవరి వైఖరి ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలను గౌరవించే లక్షణం కేసీఆర్‌లో ఉన్నదని వెల్లడించారు.