హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమపై కుట్రలు చేస్తున్నారని, తన భార్య, మంత్రి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నదని కాంగ్రెస్ నేత కొండా మురళి ఆరోపించినట్టు తెలిసింది. పార్టీ నాయకులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చేందుకు వచ్చిన కొండా మురళీ రివర్స్‌గా పీసీసీ నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. గాంధీభవన్‌లో శనివారం కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవితో భేటీ అనంతరం బయటకు వచ్చిన మురళీ ‘నన్ను రెచ్చగొట్టొద్దు.. నేను బలహీనున్ని కాదు..నాకూ ఆత్మాభిమానం ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆయన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వ్యాఖ్య లు చేయడంపై నోటీసులు జారీచేసింది.
వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమపై కుట్రలు చేస్తున్నారంటూ మురళి ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేసినట్టు సమాచారం. నిరుడు పొంగులేటి మామ, కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి తన వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నారని, ఇప్పుడు ఆ కక్షను ఆయన అల్లుడు పొంగులేటి తమపై తీర్చుకుంటున్నారని తెలిపినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితు డు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్రెడ్డిపైనా కొండా మురళి ఆరోపణలు చేసినట్టు తెలిసింది. వేం నరేందర్ నిరుడు తన భార్య కొండా సురేఖపై పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ గెలవలేని ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పుడు వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నదని పేర్కొన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేముందు తమ పదవులకు రాజీనామా చేసి వచ్చామని, కానీ ఇటీవల వచ్చిన కొంతమంది పదవులను వదులుకోకుండా కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చెలాయిస్తున్నారని కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినీరెడ్డి తమ మద్దతుతోనే గెలిచారని లేఖలో ప్రస్తావించినట్టు తెలిసింది. ఇప్పుడు వారంతా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించినట్టు సమాచారం.
హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత కొండా మురళికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరో నోటీస్ జారీచేసింది. వరంగల్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు శనివారం గాంధీభవన్‌కు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ కోరిన వాటికి, కొండా మురళి ఇచ్చిన సమాధానానికి సంబంధం లేదని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. దీంతో సరైన సమాధానం ఇవ్వాలని నోటీసు ఇచ్చామన్నారు.