చేర్యాల, జనవరి 21 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. ‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల నామస్మరణతో శైవక్షేత్రం పులకరించింది. పట్నం వారం సందర్బంగా హైదరాబాద్కు చెందిన 75 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మల్లన్న స్వామి సోదరి ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు సమర్పించారు. ఈ వేడుకలో ఆలయ ఈవో ఏ బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. సోమవారం పెద్ద పట్నం, అగ్నిగుండాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కరెంట్ లేక నీటికి కటకట..
ఉదయం 7 నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నీటి కోసం భక్తులు ఇబ్బందులు పడ్డారు. సమీపంలో ఉన్న సబ్స్టేషన్ వద్దకు వెళ్లి ట్రాన్స్కో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మోటర్లకు కరెంటు సరఫరా చేసే మెయిన్ జనరేటర్ సైతం మొరాయించడంతో భక్తులు అవస్థలు తప్పలేదు. సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రూ.20 చెల్లించి స్నానాలు చేయడంతోపాటు మరో రూ.20 చెల్లించి బిందెలో నీరు, రూ.50 చెల్లించి డబ్బాలో తాగు నీటిని తెచ్చుకున్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రకటించినా, పట్నం వారం రోజున భక్తులకు నీటి తిప్పలు తప్పలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్ధితి తలెత్తలేదని పలువురు భక్తులు పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే అన్నట్టుగా ఉండటంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.