హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో రోడ్ల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన డీపీఆర్లు, టెండర్ల ప్రక్రియపై గురువారం సమీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. అన్ని వివరాలతో అధికారులు ఈ సమీక్షకు సిద్ధంగా ఉండాలని, సీఈల పరిధిలోని ఎస్ఈలు, ఈఈలు ఈ మీటింగ్లో పాల్గొనాలని చెప్పారు.
ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీశాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ విధానంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన పది ప్యాకేజీల అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రోడ్లపై బ్లాక్ స్పాట్స్, వర్టికల్ కర్వ్స్ను గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెల్లాపూర్-అమీన్పూర్-సంగారెడ్డి, మంచాల-చౌటుప్పల్, చిట్యాల-భువనగిరి-హాలియా-మల్లేపల్లి రో డ్ల పరిస్థితిపై మంత్రి అధికారులతో పలు అంశాలపై చర్చించారు.