హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆలస్యంగా మేల్కొన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదా ఆయన సినిమాలను తెలంగాణలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ నవంబర్ 26న వ్యాఖ్యలు చేయగా, ఆ మరుసటిరోజే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ మంత్రులు తీరికగా ఐదు రోజుల తర్వాత స్పందించడం చూస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలకు తెరతీసినట్టు తెలుస్తున్నది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ మంత్రులు, నేతలు మూకుమ్మడిగా విమర్శలకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన పలు అవినీతి ఆరోపణలు, హిల్ట్ స్కాం, పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల మధ్య గొడవలు, డీసీసీల ఎంపికలో వివాదాలు, సీఎం జిల్లాల పర్యటనకు ప్రజల నుంచి స్పందన లేకపోవడం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకే మంత్రులు స్పందిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నవంబర్ 26న గోదావరి జిల్లాల్లో పర్యటించిన పవన్.. మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని వ్యాఖ్యానించారు. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుందని తెలంగాణ నేతలు అనే వారని.. నరుడి దిష్టికి నల్ల రాయి అయినా బద్దలైపోతుందని.. కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంగళవారం తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ క్షమాపణ చెప్పాలి : మంత్రి కోమటిరెడ్డి
పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే, తెలంగాణలోని ఒక థియేటర్లో కూడా ఆయన సినిమా విడుదల కాదని సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. పవన్ సోదరుడు చిరంజీవి మంచి వ్యక్తి అని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరని అన్నారు. పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్తే నైజాంలో రెండు రోజులైనా ఆయన సినిమాలు ఆడతాయని, లేదంటే ఆయన సినిమాలను ఆడనివ్వం’ అని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు అవమానకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ దిష్టి అనడం అవివేకం అని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న పవన్‌కల్యాణ్ ‘తలతిక మా టలు’ వెంటనే మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
వ్యాఖ్యలను వక్రీకరించవద్దు : జనసేన పార్టీ
కోనసీమ జిల్లాలకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల నేతల మధ్య తీవ్ర దూమరం రేపిన నేపథ్యంలో.. జనసేన పార్టీ కార్యాలయం మంగళవారం లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని పేర్కొంది. ఈ లేఖ పవన్‌కల్యాణ్ నుంచి కాకుండా ఆయన పార్టీ కార్యాలయం నుంచి విడుదల కావడం గమనార్హం. కాగా పవన్‌కల్యాణ్‌కు క్షమాపణ చేప్పే ఉద్దేశం లేనందునే.. పార్టీ తరపున లేఖ విడుదల చేయించారనే చర్చ జరుగుతున్నది.