హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్ట్‌రెడ్డి బ్రదర్స్ అని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శ ముమ్మాటికీ నిజమేనని నిరూపితమైంది. దీనిని ఎవరో నిరూపించలేదు. స్వయానా సదరు కోవర్ట్ బ్రదర్స్‌లోని ఒక బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని నిరూపించుకున్నారు!! కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ‘అన్న’ వెంకట్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ‘తమ్ముడు’ రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలంటూ కాంగ్రెస్ నాయకుడికి చేసినట్టు చెప్తున్న ఫోన్ కాల్ ఆడియో.. ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నది. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని కలరింగ్ ఇస్తున్న వెంకట్‌రెడ్డి.. తన మనసు మాత్రం తమ్ముడితోనే ఉన్నదని ఈ ఫోన్ సంభాషణలో తేలింది. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డికి దక్కేది మూడో స్థానమేనని తేలిపోవడంతో ఏదో ఒకటి చేసి తమ్ముడిని గెలిపించుకొనేందుకు ఆయన కోవర్ట్‌గా మారారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీకే ధోకా ఇచ్చారని అంటున్నారు. ఈసారికి పార్టీలకు అతీతంగా రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలని నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న చోటామోటా నేతలకు ఫోన్లు చేస్తూ అడ్డంగా ‘రికార్డయిపోయారు’. అంతేకాదు.. కాబోయే పీసీసీ ప్రెసిడెంట్‌ను తానేనని చెప్పుకోవడం విశేషం. ఈ మేరకు.. జబ్బార్ అనే కాంగ్రెస్ కార్యకర్తకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి
రాజగోపాల్‌రెడ్డికి ఓటెయ్యాలని చెప్తున్న ఆడియో వైరల్ అవుతున్నది.
ఇదీ జబ్బార్‌కు, వెంకట్‌రెడ్డికి మధ్య ఫోన్ సంభాషణ..
వెంకట్‌రెడ్డి: జబ్బార్ భాయ్..
జబ్బార్: సార్..సార్
వెంకట్‌రెడ్డి: సచ్చినా.. బతికినా.. పిల్లలకు.. పెండ్లిళ్లకు రాజగోపాల్‌రెడ్డి సాయం చేస్తుంటడు. ఇప్పుడు షబ్బీర్ అలీ మిగతావోళ్లంతా మనింటికాన్నే ఉన్నరు. ఏం లేదు. రేపు పొద్దున పీసీసీ ప్రెసిడెంట్ అవుతున్న. మన గవర్నమెంట్ వస్తది. నేను చూసుకుంట గని. దానిమందం పార్టీలకు అతీతంగా సాయం చేయండి. వ్యక్తిగతంగా బీజేపీ అయినా వాడు మనకే వత్తడు ఇగ. పీసీసీ ప్రెసిడెంట్ మనమే అయితం. మొత్తం తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తం. నేను చెప్పినట్టు చేయండి. మనోళ్లు వత్తరు మీ దగ్గరికి. మీరంతా 25 ఏండ్లకెళ్లి మా ఫ్యామిలీ మెంబర్స్.
జబ్బార్: మేము కూడా మీ అభిమానులం సార్. మీరంటే మాకు ప్రాణం సార్.
వెంకట్‌రెడ్డి: పార్టీ కాదు.. రాజగోపాల్‌రెడ్డి సాబ్. మనం నల్లగొండ హెడ్క్వార్టర్ల అందరి పేదోళ్లను ఆదుకున్నం. సచ్చినా బతికినా.. చూసుకున్నం. అందరికీ సాయం చేస్తం.
జబ్బార్: ఇబ్రహీం కూడా చెప్పిండు ఈ ఒక్కసారికి రాజగోపాల్‌రెడ్డి సార్‌కు వేయాలని.
వెంకట్‌రెడ్డి: పార్టీని చూడకండి.. రాజగోపాల్‌రెడ్డికి సాయం చేయండి. మనోళ్లు వచ్చి కలుస్తరు.
కొసమెరుపు..
ఈ సంభాషణ వింటున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ‘కోకోరావె’ అనే ముద్దుపేరు తగిలించి.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇంతకీ కోకోరావె అంటే ఏమనుకుంటున్నారు? కోవర్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.