నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): నల్లగొండ కాంగ్రెస్‌లో తొలి నుంచి రెడ్డి నేతలదే ఆధిపత్యం. ఇతర వర్గాల ఉనికినే ఆ నేతలు సహించలేరు. బీసీ నేతలను ఆది నుంచి కరివేపాకులా వాడుకునే సంస్కృతి ఆ పార్టీలో ఉన్నది. మొదటి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఆ వర్గం నేతలే దశాబ్దాలుగా ఎంపికవుతూ వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం ఒక్కచోట మాత్రమే బీసీ నేతకు ప్రాతినిధ్యం దక్కింది. ఎదిగి వచ్చేందుకు చూసిన ఎందరో బీసీ నేతలను అగ్రకులాల నేతలు అణచివేసిన సందర్భాలు అనేకం. దాడులు, దౌర్జన్యాలకు ఎందరో బీసీ, ఇతర వర్గాల నేతలు బలవుతూ వస్తున్నారు. ఇటీవల ఆ దాడుల సంస్కృతి మరింతగా పెరిగింది. బీసీ డీసీసీ అధ్యక్షుడిపై ఏకంగా ఓ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేయడం, తనను కలిసేందుకు వచ్చిన ఆ నాయకుడిని తిట్టి అవమానించడం, ఎప్పటిదో విషయాన్ని పట్టుకొని కేసు పెట్టడం లాంటి పరిణామాలు ఆ పార్టీ బీసీ నేతలపై అగ్రకుల నేతల దౌర్జన్యాలకు సాక్షీభూతంగా నిలిచాయి.
ఇదే మంత్రి గతంలో బీఆర్ఎస్లో బీసీ కీలక నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అదే అగ్రనేతలను ఆదర్శంగా తీసుకున్నామన్ననే రీతిలో అదే వర్గం కిందిస్థాయి నాయకులు మరింతగా రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలతో పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో బీసీ నేతలపై కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లాలో బీసీ నేతలు, బీసీలపై వరుసగా జరుగుతున్న కాంగ్రెస్ నేతల అరాచకాలపై బీసీలంతా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వరుస దాడులపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు ఆందోళనలకు దిగాయి.
ఏకంగా నల్లగొండ డీసీసీ అధ్యక్షుడితో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా మంత్రి అనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ మంత్రి ఒకటి తలిస్తే, అధిష్ఠానం మరోటి తలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సమీకరణాల్లో భాగంగా నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవిని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాశ్ నేతకు కట్టబెట్టింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి అనుచరులు భగ్గుమన్నారు. తన అనుచరుడికి పదవి ఇవ్వలేదని ఏకంగా డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాశ్ నేత వద్దంటూ మంత్రి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖలో చూపిన కారణాలు సైతం అందరినీ ఆశ్చర్యపరిచాయి.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో పీసీసీ కార్యదర్శి హోదాలో ఉన్న పున్న కైలాశ్ నేత అప్పట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని దూషించారట. తనను, తన కటుంబసభ్యులను అసభ్యపదజాలంతో దూషించారంటూ, అతనికి ఎలా డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారంటూ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో అతనిపై కేసు పెట్టాలంటూ నల్లగొండ ఎస్పీకి మరో లేక రాయడం సంచలనంగా మారింది. మూడేండ్ల కిందట చేసిన విమర్శలను పట్టుకొని ఇప్పుడు ఫిర్యాదు చేయడం, అవే కారణాలతో అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఇప్పుడు కోరడం ఏమిటని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన్ని కలిసేందుకు వెళ్లిన డీసీసీ అధ్యక్షుడు కైలాశ్ నేతకు మంత్రి సమయం ఇవ్వకపోగా, ‘నన్ను కలువొద్దు పో’ అంటూ అవమానకరంగా ఫైర్ అయ్యారని కైలాస్నేత అనుచరులు ఆరోపించారు. ఈ విషయం వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోమటిరెడ్డి తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
గతంలో చెరుకు సుధాకర్ కొడుకును ఇదే మంత్రి ఫోన్లో బెదిరింపులకు దిగిన విషయం కూడా వివాదాస్పదమైంది. ‘మా అనుచరులు వంద కార్లలో తిరుగుతున్నారు. నిన్ను చంపేస్తారు’ అని హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో నాడు వైరల్‌గా మారింది. బీసీ నేతలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూషిస్తే లేనిది.. పున్న కైలాశ్ నేత దూషిస్తే ఎందుకంతగా స్పందిస్తున్నారు.. అంటూ బీసీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి డైలమాలో పడిపోక తప్పలేదు.
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గంలోని ఎల్లమ్మగూడెం గ్రామంంలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ వ్యవహారంతో బీసీ వర్గాలు రగిలిపోతున్నాయి. మంత్రిపై ఆగ్రహంతో ఉన్నాయి. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలోకి దిగిన మహిళ భర్త మామిడి యాదగిరిని కాంగ్రెస్ అభ్యర్థి కిడ్నాప్ చేశాడని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బీసీ మహిళ నామినేషన్ వేసేందుకు సిద్ధమైతే ఆమె భర్తను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అటకాయించి, కారులో కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడుతూ, మూత్రం తాగించారని బీసీ వర్గాలు రగిలిపోతున్నారు.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వెంటనే బర్తరప్ చేయాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ నేతలపై మంత్ర వ్యవహార శైలితోపాటు ఆయన అనుచరులు సైతం ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని ఆగ్రహంతో ఉన్నారు. వరుస ఘటనలపై మంత్రి బీసీ వర్గాలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కడంతోపాటు దాడులకు పాల్పడుతుండటాన్ని సహించబోమని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో బీసీలపై కాంగ్రెస్ నేతల తీరు మారకపోతే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.