హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మరో రూ.28 వేల కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని, భారీగా పెట్టుబడులు వస్తాయని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని రూ. 10,400 కోట్లతో 8 లేన్లకు విస్తరించనున్నామని తెలిపారు. 6 లేన్లతో నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు రూ.36 వేల కోట్లు కేటాయించామని, ఇది అన్ని జిల్లాలను కలుపుతుందని వివరించారు. ఈ రహదారి నిర్మాణానికి 50% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రూ.11,399 కోట్లతో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) ప్రాజెక్టులో భాగంగా రహదారుల్లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్లను, సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్లను నిర్మించనున్నామన్నారు.