దేవరకద్ర, మార్చి 16 : మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన కోయిల్‌సాగర్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 52,250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల పైచిలుకు ఆయకట్టు ఉండగా.. ఈ యాసంగిలో దాదాపు 15 వేల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఇటీవల జరిగిన వాటర్ బోర్డు సమావేశంలో ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 4 వేల ఎకరాలు, కుడి కాలువ కింద 8 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లివ్వాలని రెండు నెలల కిందట జరిగిన ఐడీబీ సమావేశంలో అధికారులు తీర్మానించారు. దీంతో ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉన్నా పంటలకు వదలని పరిస్థితి.
పంటలు చేతికొచ్చే దశలో నీళ్లులేక ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేండ్ల కిందట పుష్కలమైన సాగునీటితో బంగారు పంటలు పండితే.. కాంగ్రెస్ హయాంలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. మూడు నెలలుగా చేసిన రెక్కల కష్టం వృథా అవుతుందని, రేయింబవళ్లు శ్రమించి వేసిన పంట చేతికందే దశలో చేజారిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. బోరుబావుల్లో చుక్క నీరు లేక కండ్ల ముందే పంటలు ఎండుతుంటే సాగు చేసిన రైతుల గుండె తరుక్కుపోతున్నది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద చివరి ఆయకట్టు పరిధిలో నీళ్లు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. డోకూరుకు చెందిన రైతు చంద్రమౌళికి గ్రామ శివారులో ఉన్న 8 ఎకరాల్లో నాలుగు బోర్లు వేయగా.. రెండు బోర్లల్లో నీరు ఉండగా వరి పంట సాగు చేశాడు. నెల రోజులుగా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో పంటలను కాపాడుకునేందుకు వారం కిందట మరో బోరు 530 ఫీట్లు డ్రిల్లింగ్ చేయిస్తే ఒక ఇంచు నీళ్లు పడ్డాయి. నీళ్లు సరిపోక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. స్థానిక ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులకు స్థానిక రైతులతో కలిసి పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ప్రాజెక్టులో నీళ్లున్నా విడుదల చేయకపోవడంతో నాలుగెకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన చెందుతున్నాడు.
నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కొటాలగూడ గ్రామ రైతు పగిడాల జంగయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఎకరం పొలంలో జొన్న, అర ఎకరంలో చేమంతి సాగు చేస్తున్నామని, ప్రస్తుతం బోరు నుంచి నీరు సరిగ్గా రావడం లేదని చెప్తున్నాడు. రెండు నెలలుగా నీరందక జొన్న పంట సగం వరకు నేలకొరిగిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు. నీరు తక్కువగా ఉండటంతో చేమంతిని డ్రిప్పుతో సాగు చేస్తున్నట్టు తెలిపాడు. ఓవైపు నీరు పారితే మరో వైపు నీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయని చెప్పాడు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే దుఃఖం వస్తుందని అంటున్నాడు రైతు జంగయ్య. ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు అప్పు అయ్యిందని, తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.
– వికారాబాద్