ములుగురూరల్, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగలోపు ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ పథకాన్ని(Ambedkar scheme) ప్రారంభించడంతో పాటు రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని దళిత బంధు రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం దళిత బంధు లబ్ధిదారులు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం స్థానిక డీఎల్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో సమయం ఇచ్చినప్పటికీ రెండో విడత దళిత బంధు(Dalitha Bandhu) నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివుడు, ప్రజా సంఘాల నాయకుడు ముంజాల భిక్షపతిగౌడ్, ఏజీపీ మేకల గౌతమ్‌కుమార్ హాజరై మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ మడికొండ రమేశ్, దర్శనాల సంజీవ, కావేరి చిన్ని కృష్ణ, రాజేశ్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, రమేశ్, రామన్న, గద్దల శంకర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.