కొడిమ్యాల, అక్టోబర్ 5: ఏజెంట్ మాటలు నమ్మి దేశం కాని దేశం ఇరాక్ వెళ్లి నరకయాతన అనుభవించిన జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన గుండెల్లి రంజిత్, గుండెల్లి రవితేజ, నిజామాబాద్ జిల్లా అర్మూర్కు చెందిన పార్థసారథి ఎట్టకేలకు ఇండ్లకు చేరారు. వివరాల్లోకి వెళితే.. రంజిత్, రవితేజ, పార్థ్ధసారథి గత మార్చిలో వేములవాడకు చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి ఇరాక్ వెళ్లారు. కిచెన్ క్లీనింగ్ డ్యూటీ కోసం అని చెప్పి పంపించగా, అక్కడికి వెళ్లాక ఓ షాపింగ్ మాల్లో డ్యూటీ వేశారు. అక్కడి కంపెనీవారు జీతం సరిగ్గా ఇవ్వకుండా, అధిక గంటలు పనిచేయించుకుంటూ చిత్రహింసలు పెట్టారు. ఇంటికి వెళ్తామని చెప్పినా వినకుండా భయపెట్టి మరీ పనిచేయించారు.
విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేయగా, కొడిమ్యాలకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు అంకం రాజేశం ద్వారా కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను సంప్రదించారు. వెంటనే స్పందిచిన ఆయన వారు పడుతున్న బాధలను వివరిస్తూ, వెంటనే స్వదేశానికి రప్పించాలని కోరుతూ వారం రోజుల క్రితం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య శంకర్‌కు లేఖ రాశారు. దీంతో రంజిత్, రవితేజ, పార్థసారథి శనివారం స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో వినోద్ కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.