నారాయణపేట టౌన్, జూలై 28 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు కన్నెర్ర చేశారు. బలవంతంగా భూసేకరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న దాదాపు 20 గ్రామాలకు చెందిన రైతులు సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. విషయం తెలుసుకొన్న పోలీసులు కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆక్రోశం వెల్లగక్కుతూ అక్కడే రోడ్డుపై 3 గంటలపాటు బైఠాయించారు.వీరికి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మశ్చందర్ మాట్లాడుతూ.. ఆర్డీవో రామచందర్ రైతులను బెదిరించడం సరికాదని అన్నారు. బహిరంగ మార్కెట్ విలువ మేరకు ధరను నిర్ణయించి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయమైన పరిహారం ఇస్తేనే భూములు అప్పగిస్తామని తేల్చిచెప్పారు. కలెక్టర్ బయటకు రావాలని.. లేకుంటే తామే కార్యాలయంలోకి వెళ్తామని రైతులు పెద్ద ఎత్తున హెచ్చరించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ సచిన్ గంగ్వార్ రైతుల వద్దకు రావడంతో వినతిపత్రం అందజేసి తమ భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.