మక్తల్, జూలై 31 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమను సర్కార్ మోసగించిందని భూనిర్వాసితులు ఆరోపించారు. తమ ఆందోళనకు అండగా నిలబడాలని నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లికి చెందిన భూనిర్వాసితులు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకుల మద్దతు కోరుతూ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు సాగునీళ్లు తీసుకెళ్లేందుకు చేపట్టే ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో తమ గ్రామానికి చెందిన 300 ఎకరాలకుపైగా భూములు ముంపునకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
తమకు సమాచారం ఇవ్వకుండానే భూములు గుంజుకునేందుకు అధికారులు గ్రామాల్లోకి వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన పరిహారం అందే వరకు తమతో కలిసి రావాలని కోరారు.