వరంగల్ : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మాప్ అప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన ఖాళీలను మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నది. ఈ నెల 24న సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెబ్ ఆపన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీ పేర్కొంది.
ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్ పాల్గొనవచ్చని, గత విడత కౌన్సెలింగ్ సీట్ అలాటై.. జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ అయినా, ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు కౌన్సెలింగ్కు అనర్హులని స్పష్టం చేసింది. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాయలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.