ఖైరతాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ మీద విషం చిమ్ముతూ ఇష్టారాజ్యంగా కథనాలు వండివార్చడంలో రాటుదేలిన ఆంధ్రజ్యోతి తాజాగా ‘సైనికుల సంక్షేమం ఉత్తుత్తి మాటేనా’ అంటూ రాసిన వార్తపై మాజీసైనికులు మండిపడుతున్నారు. అవాకులు, చెవాకులు కాకుండా వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని గడ్డిపెడుతున్నారు. ‘దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సంక్షేమానికి పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రజ్యోతి పత్రిక అవాస్తవాలు రాసింది.. సత్యం తెలుసుకుంటే మంచిది’ అని రాష్ట్ర మాజీ సైనికుల సమాఖ్య చైర్మన్ పరెడ్డి మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడి యా సమావేశంలో ఆంధ్రజ్యోతి కథనాన్ని తూర్పారబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక డీజీపీ చైర్మన్‌గా, హోం శాఖ కార్యదర్శి వైస్‌చైర్మన్‌గా 2015 సెప్టెంబర్ 3న సీఎం కేసీఆర్ వేసిన ఆరుగురు సభ్యుల కమిటీ సమావేశాలు ఇంతవరకు నామమాత్రంగా జరిగాయని ఆ పత్రికలో రాసింది శుద్ధ తప్పని అన్నారు. వాస్తవానికి 2016 జనవరి, నవంబర్‌లో, 2018 జూన్, 2019 డిసెంబర్లో సమావేశాలు జరిగాయని, 2020-21లో కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించలేదని చెప్పారు. నిధుల విషయానికి వస్తే సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో తనవంతుగా రూ.లక్ష, మంత్రులు రూ.20 వేలు, ఎమ్మెల్యేలు రూ.10 వేలు, ప్రభుత్వం ఉద్యోగులు ఒక రోజు బేసిక్ జీతం ఇస్తున్నట్టు ప్రకటించారని, 2018 నుంచి సైనిక సంక్షేమానికి నిధులు అందుతున్నాయన్నారు. సైనిక సంక్షేమ నిధిలో రూ.23 కోట్లు ఉన్నాయని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించకుండా అలాగే ఉంచారని చెప్పారు.
జీవోల ప్రకారమే సీట్ల కేటాయింపు
ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే జీవో ప్రకారం ఒక్క శాతం ఇవ్వాల్సి ఉంటుందని, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వంటి కోర్సులకు 2 శాతం ఇస్తున్నారని మనోహర్‌రెడ్డి తెలిపారు. జీవోల ప్రకారమే సీట్లు కేటాయిస్తున్నారని స్పష్టంచేశారు. ఎక్స్ సర్వీస్‌మెన్‌కు జాబ్స్ ఇవ్వడంలేదని రాయ డం సరికాదన్నారు. జాబ్స్ పథకం అమలవుతున్న విషయాన్ని తెలుసుకొని రాస్తే బాగుండేదని చెప్పారు. వీఆర్ఏ, వీఆర్వో, జెన్కో, టీపీపీఎస్సీలో కూడా అమలవుతుందని గ్రహించాలని కోరారు. 1956లో ఒక్కటే సైనిక్ ఆరాంఘర్ కట్టారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో సంక్షేమ భవనాలు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభమవుతాయని, ఖమ్మంలో నిర్మాణదశలో ఉన్నదని తెలిపారు.
వితంతువులకు పెన్షన్లు
అమరులైన సైనికుల కుటుంబాల్లో వితంతువులకు పింఛన్లు ఇస్తున్నారని, వారితోపాటు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని మరణించినవారి కుటుంబాల్లోని వితంతువులకు సైతం అందిస్తున్నారని సమాఖ్య గౌరవ చైర్మన్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఏటా డిసెంబర్ 7న ఫ్లాగ్ డే ఫండ్ సేకరిస్తారని, ఇప్పటివరకు రూ.30 కోట్లు నిధులు సమకూరాయని చెప్పారు. సైనికుల భూములు, ఇతర వివరాలన్నింటినీ డిజిటలైజ్ చేశారని, లైఫ్ సర్టిఫికెట్ సైతం డైరెక్టర్ కార్యాలయంలో ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చారని చెప్పారు. చైనాతో జరిగిన పోరులో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు ఇంటికి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి రూ.5 కోట్ల చెక్కును కుటుంబానికి అందజేశారని, 700 గజాల స్థలం, ఆయన సతీమణి సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారని గుర్తుచేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సైనికుల సంక్షేమానికి ఇంతగా పాటుపడిన దాఖలాలు లేవని చెప్పారు. సహృదయత కలిగిన సీఎం కేసీఆర్ అని, ఆయన సైనికుల మేలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. సమావేశంలో సమాఖ్య సెక్రటరీ జనరల్ కే మధు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దండిగా ప్రభుత్వ ప్రోత్సాహం
పుణె నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందిస్తున్నదని, 66 మందికి రూ.2 లక్షల చొప్పున సాయం అందిన సంగతి తెలుసా? అని మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాయం చేయలేదని నొక్కిచెప్పారు. దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2వేల మంది ఎక్స్సర్వీస్మెన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌గా నియమించారని, అప్పుడు వారి వేతనం రూ.7,500 మాత్రమేనని, 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.10 వేలకు పెంచారని, రెండు సంవత్సరాల తర్వాత రూ. 20 వేలు, రెండు నెలల క్రితం రూ.26 వేలకు పెంచారని.. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాస్తే బాగుండదని హితవుపలికారు.