నర్మెట, ఆగస్టు 15: జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తులతో దాడి వరకు వెళ్లింది. జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో కొందరు యువకులు చందాలు వేసుకొని బుధవారం రాత్రి జాతీయ జెండావిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో గోల్కొండ శ్రీనివాస్, కంతి స్వామికి బుధవారం రాత్రి గొడవ జరిగింది. గురువారం ఉదయం జాతీయ జెండావిష్కరణ అనంతరం పెద్ద మనుషులు పిలిచి రాత్రి గొడవ ఎందుకు జరిగిందని స్వామిని, శ్రీనివాస్‌ను విచారించారు.
శ్రీనివాస్ పెద్ద మనుషులు చెప్పింది వినకుండా తన వద్ద ఉన్న కత్తితో స్వామి, రవిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్వామిని హైదరాబాద్‌లోని నీలిమా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై నగేశ్ తెలిపారు.
ఎమ్మెల్యేల నారాజ్
నిజామాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంద్రాగస్టు వేడుకల్లో గౌరవ వందన స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలువురిలో అసంతృప్తిని రగిల్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకింత నారాజ్ అయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ శాసనసభ్యులను పక్కన పెట్టి కార్పొరేషన్ చైర్మన్లకు జెండా ఎగురవేసే అవకాశం రావడంతో పలువురు నొచ్చుకున్నట్టుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగానే జెండా వందనానికే ముఖం చాటేసినట్టుగా అర్థమవుతున్నది.
కామారెడ్డిలో వేరే జిల్లాకు చెందిన వ్యక్తి కి అవకాశం ఇచ్చి ఈ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అలీని వేరే జిల్లాకు పంపడంపైనా చర్చ నడుస్తున్నది. మంత్రి పదవి రాలేదన్న బాధ వెంటాడుతుండగా.. మరోవైపు పం ద్రాగస్టు వేడుకల్లో జెండా ఆవిష్కరణలోనూ చోటు లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలూ అసంతృప్తితో ఉన్నారు.