హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని అన్నారు.
శనివారం నాలెడ్జ్ సిటీలో ఏఐ ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ రెంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కాన్క్లేవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నైవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ), కోల్ ఇండియా(సీఐఎల్) రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.