హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయాలకు మార్గదర్శి అని, ఎందరో నాయకులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. వెంకయ్యనాయుడు జీవన ప్రస్థానాన్ని వివరిస్తూ సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకాన్ని మంగళవారం జుబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ఆవిష్కరించారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్త్రాత్రేయ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీశ్‌రెడ్డి, వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవనంలో వెంకయ్యనాయుడు అనేక మంది నాయకులకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో ఆయన ప్రస్థానం ప్రారంభమై జనసంఘ్, బీజేపీలో వివిధ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. తెలంగాణ అంశంపై అసెంబ్లీ, పార్లమెంట్లో వెంకయ్యనాయుడు ప్రదర్శించిన హుందాతనం, వాదనా పటిమ నేటి తరం నాయకులకు ఆదర్శమని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్యనాయుడు సమర్థంగా నిర్వహించారని, ఉప రాష్ట్రపతిగా రాజ్యసభను హుందాగా నడిపించారని గుర్తుచేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తన రాజకీయ జీవన ప్రస్థానాన్ని ప్రతిబింబించే ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. తనపై అభిమానంతో కార్యక్రమానికి హాజరైన అతిథులు, వివిధ రంగాల ప్రముఖులు, ఆత్మీయులు, మిత్రులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంధి మల్లికార్జునరావు పుస్తక రచయిత, పాత్రికేయుడు మాశర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.