బోధన్/వినాయక్‌నగర్, ఫిబ్రవరి 22: రేవంత్ సర్కారు చేపట్టిన కులగణనతో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కులగణనపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ హాస్యాస్పదమని అన్నారు. చర్చల కంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. 400 రోజులు గడుస్తున్నా అమలు చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని, బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వివిధ వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ ముఖం చాటేశారని విమర్శించారు.