హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : అమెరికా పర్యటనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లకముందే ఆయన స్థాయికి తగ్గట్టుగా విదేశీ పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వట్లేదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని, అధికారులతో చర్చించి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
కానీ రేవంత్రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారని మండిపడ్డారు. విదేశీ యూనివర్సిటీలు తీసుకొస్తామని చెప్పే రేవంత్రెడ్డి.. ముందు రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడినపెట్టాలంటూ చురకలంటించారు. అధికారంలోకి రాగానే విద్యారంగానికి బడ్జెట్లో కేటాయిస్తామన్న 15శాతం నిధులు, విద్యార్థులకు స్కూటీలు, విద్యాభరోసా కార్డులు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏమయ్యాయని కిషన్రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, ఓవర్డ్రాఫ్ట్ తెచ్చి ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇవ్వాల్చిన పరిస్థితి నెలకొన్నదని కిషన్రెడ్డి తెలిపారు. సంస్థకు బకాయిపడ్డ రూ.55వేల కోట్లను ప్రభుత్వం త్వరితగతిన ఇవ్వాలని కోరారు.