Kishan Reddy | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఏడాదైనా ఒక్క హమీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘ఆరు అబద్ధాలు 66 మోసాలు’ పేరిట బీజేపీ ఆదివారం చార్జిషీట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ సర్కార్ విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి.. పేదల ఇండ్లను కూలుస్తున్నారని ఆరోపించారు. ఇండ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నా.. భూ దందా కోసమే ప్రజలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు.
హామీలు అమలు చేయాలని అడిగితే ఎక్కిస్తా.. తొక్కిస్తా.. అని రేవంత్‌రెడ్డి అహంకారపూరితంగా మట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ అని గారడీ చేసి ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని గుర్తుచేశారు. బిల్లులన్నీ పెండింగులో ఉంచి ఏడాది పాలనలో సకల జనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బూతులు మాట్లాడకుండా వస్తే రేవంత్‌రెడ్డితో హామీల అమలుపై చర్చకు ఎక్కడికి రావడానికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండానే పూర్తిగా చేశామంటూ ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులను నయవంచన చేశారని దుయ్యబట్టారు.