హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదు?’ తెలంగాణ సర్కారును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పదే పదే అడుగుతున్న ప్రశ్న ఇది. ఆరోగ్య శ్రీ కన్నా అధ్వానంగా ఉన్నా.. కవరేజీ తక్కువగా ఉన్నా.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీతో కలిపి ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కిషన్‌రెడ్డి చెవికి ఎక్కడం లేదు. ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయుష్మాన్ భారత్ అమలవుతున్నదని చెప్పింది. రాష్ర్టాలవారీగా పథకం అమలు వివరాలు ఇవ్వాలని పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం తాజాగా సమాధానం ఇచ్చింది. తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తున్నామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 18వ తేదీన ఆయుష్మాన్ భారత్ అమలు కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకొన్నది. ఈ విషయంపై అవగాహనలేని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పూర్తి విషయాలు తెలుసుకోవాలని సోషల్‌మీడియా వేదికగా ఆయనకు చురకలు అంటిస్తున్నారు.
ఆయుష్మాన్ గందరగోళం
వాస్తవానికి ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో ఆహార భద్రతకార్డు (తెల్ల రేషన్‌కార్డు) ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తున్నది. సుమారు 90 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉన్నది. కానీ, ఆయుష్మాన్ భారత్ గందరగోళంగా ఉంది. సొంత ఇల్లు ఉంటే ఈ పథకానికి అనర్హులు. రాష్ట్రంలో కేవలం 25.9 లక్షల కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకం కింద చికిత్స పొందినవారికి వైద్య ఖర్చులను కేంద్రం కేవలం 60% భరిస్తే.. రాష్ర్టాలు 40 శాతం భరించాల్సి ఉంటుంది. అయినా ఆయుష్మాన్ భారత్ ఏదో అద్భుతమైన పథకం అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేసుకోవడం, రాష్ర్టాన్ని తప్పుబట్టడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.