మద్యం, విలాస జీవితానికి అలవాటుపడి.. ఆర్థిక కష్టాలు
దొంగగా మారిన కిరాణా వ్యాపారి అరెస్టు
గుట్కా బ్యాగులో చోరీ చేసిన బంగారం
సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): యజమాని ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీలో అద్దంకి అరుణ్‌కుమార్ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. విలాసవంతమైన జీవితంతో అప్పులు పెరిగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దొంగతనం చేసేందుకు పథకం వేశాడు. తన యజమాని ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి యజమాని శ్రీనివాస్, జ్యోత్స్న దంపతులు ఈనెల 1వ తేదీన తిరుపతి వెళ్లారు.
అయితే, అరుణ్‌కుమార్ మరుసటి రోజు వారికి ఫోన్‌చేసి తిరుపతి నుంచి వచ్చారా సార్.? కిటికీలు, తలుపులు కొట్టుకుంటున్నాయి.. అని చెప్పాడు. మేము ఇంకా రాలేదు.. వీడియో కాల్ చేసి చూపించండి.. అని యజమాని కోరాడు. వీడియో కాల్లో మొదటి అంతస్తులోని ప్రధాన ద్వారం తాళం వంగి ఉండటం, ఇంట్లో బెడ్రూం డోర్ తెరిచి ఉండటం కనిపించింది. వెంటనే జ్యోత్స్న తన తల్లిదండ్రులను పంపించింది. 4వ తేదీన ఇంటికి వచ్చిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా అరుణ్‌కుమార్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు అతడిని విచారించారు. తొలుత తనకేమీ తెలియదంటూ చెప్పాడు. పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నించడంతో నేరం చేసినట్లు అంగీకరించాడు. చోరీ చేసిన సొత్తును భద్రంగా ఓ గుట్కా బ్యాగులో పెట్టాడు. ఆ బ్యాగ్‌ను తన స్నేహితుడి వద్ద దాయడంతోపాటు అతడిని కూడా గుట్కా ప్యాకెట్ల బ్యాగుగా నమ్మించాడు. నిందితుడి నుంచి 53.9 తులాల బంగారం, 166 గ్రాముల వెండి, లక్షన్నర నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.