Telangana | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో కింగ్‌ఫిషర్, హీన్కెన్ బీర్ల అమ్మకాలను నిలిపివేయనున్నట్టు యునైటెడ్ బ్రూవరీ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది. ‘తెలంగాణలో నిర్వహణ నష్టాలు భారీగా కొనసాగుతున్నందున రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి మా బీర్ల సరఫరాలను వెంటనే నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. మా ఉత్పత్తులకు అందించే బేస్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు. దీని ఫలితంగా మాకు నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటివరకూ ప్రతి బీర్‌ను నష్టానికే అమ్ముకున్నాం. టీజీబీసీఎల్ నుంచి రావాల్సిన బకాయిలు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఇవన్నీ కలిసి మా బీర్ల సరఫరాను మరింత క్లిష్టతరం చేశాయి’ అని ఆ లేఖలో పేర్కొన్నది. బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, ధరల పెంపుదలపై అనేకసార్లు వినతులు ఇచ్చినా, నేటికీ ఎటువంటి పరిషారం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని, తమతో కలిసి పనిచేయాలని తాము కోరుతున్నామని ఆ లేఖలో కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. బీర్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ సుమారు రూ.1000 కోట్ల వరకు బకాయి పడిందని, ఆ బిల్లులు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్రంగా నష్టపోతున్నదని యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ పేర్కొన్నది. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్ 30 ప్రకారం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి కింగ్‌ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్టు తెలిపింది.