హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడ్డ 12 ఏండ్ల బాలుడికి 65 రోజుల పాటు ఎక్మో చికిత్స చేసి బతికించారు హైదరాబాద్‌లోని కిమ్స్ డాక్టర్లు. ఆసియాలోనే అతి ఎక్కువ కాలం ఒక బాలుడికి ఎక్మో బ్రిడ్జిపై చికిత్స అందించటం ఇదే తొలిసారి అని దవాఖాన వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శౌర్య (12)కు కొన్ని నెలల కిందట కరోనా సోకింది. తీవ్ర ఇన్ఫెక్షన్తో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. ఎక్మో థెరపీ అవసరం కావటంతో అతడిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. డాక్టర్ సందీప్ అత్తావర్ నేతృత్వంలోని ట్రాన్స్‌ప్లాంట్, రెస్పిరేటరీ కేర్ ఫిజీషియన్లు, ఫిజియోథెరపిస్టుల బృందం బాలుడిని వీనో-వీనస్ ఎక్మోపై 65 రోజుల పాటు ఉంచారు. ఓ వైపు పోషకాహారం అందిస్తూనే, మరోవైపు శారీరక వ్యాయామం ద్వారా అవయవాల పనితీరును మెరుగుపరిచారు. తాజాగా ఆ బాలుడు పూర్తిగా కోలుకోవటంతో కిమ్స్ దవాఖాన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్ బొల్లినేని, ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్ విజయ్, చీఫ్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ప్రభాత్ దత్తా శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ సందీప్ అత్తావర్ ఇప్పటివరకు 12 వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు, 350 ఊపిరితిత్తుల మార్పిడి, గుండె మార్పిడి, కృత్రిమ గుండె అమరిక చికిత్సలు చేసినట్టు పేర్కొన్నారు.