బంజారాహిల్స్, జనవరి 3: రోడ్డుమీద వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి కారులో ఎక్కడం.. తన బట్టలు తనే చింపుకొని రేప్ చేసేందుకు ప్రయత్నించినట్టు డ్రామా క్రియేట్ చేసి కేసులు పెడతానంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్న కిలేడీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన సయీదా నయీమా సుల్తానా గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై తిరుగుతూ కార్లలో వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. రాత్రిపూట రోడ్లపై లిఫ్ట్ ఇవ్వాలని ఖరీదైన కార్లను ఆపుతుంది. లిఫ్ట్ ఇచ్చిన వారితో మాటలు కలిపి డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభిస్తుంది. కోరినంత ఇవ్వకపోతే తన ఒంటిమీద బట్టలు చింపుకొని రేప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. దీంతో బెదిరిపోయి బాధితులు అడిగింత డబ్బులు ఇచ్చేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10గంటల ప్రాంతంలో కారులో వెళ్తున్న బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన పరమానంద్‌ను నయీమా లిఫ్ట్ అడిగింది.
కారులో ఎక్కగానే రూ.1000 ఇవ్వాలని లేకుంటే అరిచి గోల పెడతానంటూ బెదిరింపులకు దిగింది. షాక్‌కు గురైన పరమానంద్ తనవద్ద డబ్బులు లేవని చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే బట్టలు చింపుకుని రేప్ కేసు పెడతానని బెదిరించింది. దీంతో కారును నేరుగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌వద్దకు తీసుకువెళ్లిన పరమానంద్ ఆమెను కిందకు దిగాలని కోరగా నిరాకరించడంతో పాటు పీఎస్ ఎదురుగానే తన బట్టలు చించుకుని హల్చల్ చేసింది. కారులోంచి దిగి పరమానంద్ మీద దాడి చేయడంతోపాటు తనను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కారులో తీసుకొస్తూ రేప్ చేసేందుకు యత్నించాడంటూ వీరంగం సృష్టించింది.
దీంతో బాధితుడు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుండటంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడితోపాటు నిందితురాలు నయీమా సుల్తానాను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తప్పును అంగీకరించింది. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నయీమా సుల్తానా మీద నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో గతంలో 16 కేసులు నమోదైనట్టు విచారణలో తేలింది. బాధితుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు గుంజినట్టు తెలుస్తున్నది. ఇదిలాఉండగా తాను అడ్వకేట్‌నని, తనజోలికి వస్తే ఏయే సెక్షన్ల కింద కేసులు పెడతానో చూసుకోండి అంటూ పోలీసులను సైతం బెదిరించడం కొసమెరుపు.