హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు మరో ఘనత సాధించారు. దక్షిణ భారత్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో మునుపెన్నడూ లేనివిధంగా నల్లగొండకు చెందిన 33 ఏండ్ల రోగికి రోబోటిక్ పద్ధతిలో విజయవంతంగా మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేసి చరిత్ర సృష్టించారు. యూరాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో డాక్టర్ రామ్‌రెడ్డి, డాక్టర్ ధీరజ్ సర్జరీ నిర్వహించారు. వారికి అనుభవజ్ఞులైన యూరాలజిస్టుల బృందం తోడ్పాటు అందించింది. ఆ బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అభినందించారు. ప్రస్తుతం ఆ రోగి వేగంగా కోలుకుంటున్నట్టు తెలిపారు.