హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేటు దవాఖానలో అక్రమంగా కిడ్నీ మార్పిడులు చేస్తున్న కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఇకపై కేసును సీఐడీ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తాయి. కేసు బదిలీ ఉత్తర్వులు ఇంకా అందలేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. మరోవైపు సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు అధికారులు కేసును శోధిస్తున్నారు. ఇప్పటికే దవాఖాన నిర్వాహకుడు సముంత్, దళారి గోపిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. వీరి ద్వారా మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని చెబుతూ కస్టడీకి తీసుకోవాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అరెస్టయిన సుమంత్, గోపి ముందే న్యాయవాదులను సిద్ధం చేసుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగానే వారి ఆచూకీ చెప్పాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో మరో 8 మంది ముఠా సభ్యులు, సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అసలు సూత్రధారి అతడే?
కిడ్నీ రాకెట్ కేసులో వైద్యుడు అవినాశ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఇతని ద్వారానే అలకనంద దవాఖానలో అక్రమంగా కిడ్నీ మార్పిడి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు అలకనందతో కార్పొరేట్ దవాఖానలకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వం కమిటీ అలకనంద దవాఖానలో లోపలి పరిస్థితులను పరిశీలించకుండానే నివేదికను ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తున్నది.
అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టేలా
సంచలనాత్మక కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి బదిలీ చేయడంలో ప్రభుత్వ ఆంతర్యం అర్థం కావడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసును సీఐడీకి బదిలీ అయిందంటే ఆ కేసు దర్యాప్తు ప్రాధాన్యత తగ్గుతుందనే భావన ప్రజల్లో చెబుతున్నారు. ఇప్పటికే వివిధ కేసులలో పూర్తిస్థాయి దర్యాప్తు జరగకుండానే అటకెక్కినవి ఉన్నాయి. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్థాయిలో ముడిపడి ఉండడం, హైదరాబాద్‌లో మానవ అవయవాల అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు, కార్పొరేట్ దవాఖానల ప్రమేయాలు, వారికి అధికార యంత్రాంగంలో కొందరితో సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు తదితర అంశాలతో ఈ కేసు దర్యాప్తు పూర్తిస్తాయిలో జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలకనంద కేసు దర్యాప్తు వరకే పరిమితం చేసి కేసు మామ అన్పిస్తారా? లేక కిడ్నీ మాఫియా గుట్టును పూర్తిస్తాయిలో రట్టు చేస్తారా? వేచి చూడాల్సిందే.