న్యూఢిల్లీ: తెలంగాణ మరో ప్రతిష్టాత్మక క్రీడా పండగకు వేదిక కానుంది. ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) ఆతిథ్య హక్కులు రాష్ర్టానికి కేటాయించినట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. ఈ పోటీలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణలో అద్భుతమైన క్రీడా మౌలిక వసతులతో పాటు అంతకుమించిన ఉత్సాహం, ఆసక్తి ఉంది. ఈ గేమ్స్‌లో కనీసం 8 వేల మంది అథ్లెట్లు పోటీ పడతారు’ అని పేర్కొన్నారు. మేజర్ నేషనల్ ఈవెంట్లను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రణాళికలో భాగంగా రాష్ర్టానికి ఈ గేమ్స్‌ను కేటాయించినట్టు తెలిపారు. కాగా, గత ఎడిషన్ కేఐవైజీకి బీహార్ ఆతిథ్యం ఇచ్చింది.