భద్రాచలం, జూన్ 7: భద్రాద్రి జిల్లా భద్రాచలంలో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన చోటుచోసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కణితి సతీశ్ (24) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కాలనీకి చెందిన కొందరు యువకులతో గ్యాంగ్ ఏర్పాటుచేసుకున్నాడు. అదే పట్టణంలో జగదీశ్ కాలనీకి చెందిన గంజి సాయిరాం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు కండక్టర్‌గా, క్లీనర్‌గా పనిచేస్తూ మరికొందరు యువకులతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు.
రెండేళ్ల క్రితం వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ రెండు గ్యాంగ్‌లు ఘర్షణ పడ్డాయి. అప్పటి నుంచీ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సాయిరాం గ్యాంగ్‌లోని ఓ యువకుడిని సతీశ్ గ్యాంగ్‌లోని ఓ యువకుడు బెదిరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సతీశ్..ట్రావెల్స్ వద్దకు వెళ్లి సాయిరాంను హెచ్చరించారు. తమ కార్యాలయం వద్దే తనను హెచ్చరించడాన్ని అవమానంగా భావించిన సాయిరాం.. తన గ్యాంగ్‌తో కలిసి సతీశ్‌ను అంతం చేసేందుకు ప్లాన్ చేశాడు.
శనివారం సాయిరాం తన గ్యాంగ్ సభ్యులతో సతీశ్ ఇంటికి వచ్చాడు. సతీశ్‌ను బయటకు పిలిపించి మాట్లాడుతూనే.. అప్పటికే తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అడ్డుకోబోయిన సతీశ్ సోదరురు రమణపై దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న సతీశ్, గాయపడిన రమణను స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సతీశ్ ప్రాణాలు విడిచాడు. రమణ కోలుకుంటున్నాడు. ప్రధాన నిందితుడు సాయిరాం, అతడి గ్యాంగ్‌లోని 15 మంది సభ్యులు భద్రాచలం పోలీసుల ఎదుట లొంగిపోయారు.