ఖమ్మం రూరల్, జూన్ 21:‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన మనస్ఫర్థలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టినందుకు మాకు ఇంత శిక్ష వేశావేంటమ్మా?’ అంటూ కన్నుమూసిన చిన్నారులు తమ కన్నతల్లిని అడుగుతున్నట్టుగా వారి కుటుంబీకులు చేస్తున్న ఆర్తనాదాలు, శోకసంద్రంలో వేస్తున్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. స్వగ్రామానికి మకాం మార్చే విషయంలో భర్తతో ఓ భార్య పడిన ఘర్షణ చివరికి వారి పిల్లల ప్రాణాలను తీసేదాకా వెళ్లిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు .. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడుకు చెందిన బొబ్బిలి లింగరాజు, స్వాతి దంపతులు కొద్ది నెలలుగా ఖమ్మం త్రీటౌన్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి వేదక్కుమార్ (7), తనీశ్ (4) అనే కుమారులున్నారు. లింగరాజు ఓ సెల్‌ఫోన్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా షాపు నడుపలేనని, ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలని లింగరాజుకు సెల్‌ఫోన్ షాపు యజమాని చెప్పాడు. లింగరాజు ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు.
స్వగ్రామానికి వెళ్లి వేరే పని చూసుకుందామని చెప్పగా భార్య స్వాతి నిరాకరించింది. ఇదే విషయమై రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకున్న భార్య.. శనివారం లింగరాజు ఇంట్లో లేని సమయం చూసి.. బిస్కెట్లకు ఎలుకలమందు పూసి పిల్లలకు తినిపించింది. అనంతరం ఏమీ తెలియనట్టు భర్తకు ఫోన్ చేసింది. పిల్లలకు వాంతులు అవుతున్నాయని, త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. దీంతో హుటాహుటిన ఓ మెడికల్ షాపునకు వెళ్లిన లింగరాజు.. వాంతులు తగ్గేందుకు ఓ సిరప్ తీసుకొని ఇంటికి వచ్చాడు. పిల్లలకు తాగించి పడుకోబెట్టాడు.
విష ప్రభావంతో పెద్ద కుమారుడు వేదక్కుమార్ శనివారం రాత్రి నిద్రలోనే కన్నుమూశాడు. చిన్న కుమారుడు తనీశ్‌కు ఆదివారం ఉదయం వాంతులు కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. పిల్లల పరిస్థితి విషమిస్తున్న తరుణంలో స్వాతి సైతం ఎలుకలమందు తినడంతో స్థానికులు ఆమెను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఖమ్మం త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఫాదర్స్‌డే రోజున ఓ తండ్రి తన పిల్లలను కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.