హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అలైన్‌మెంటు మారింది. తనికెళ్ల మీదుగా కాకుండా బల్లేపల్లి, ఖానాపురం హవేలీ మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త అలైన్మెంట్ వల్ల కలెక్టరేట్‌కు ఎటువంటి ముప్పు ఏర్పడే అవకాశం లేదు. కలెక్టరేట్ కాంపౌండ్‌వాల్‌కు దాదాపు 550 మీటర్ల దూరం నుంచి దీనిని నిర్మించనున్నారు. దీంతో కలెక్టరేట్ ఓఆర్ఆర్ వెలుపల ఉండనున్నది. దీనివల్ల రోడ్డు పొడవు మూడు కిలోమీటర్లు తగ్గుతున్నది. దీనికి జాతీయ రహదారుల అథారిటీ ఆమోదం తెలిపింది.
ఖమ్మం చుట్టూ జాతీయ రహదారులు
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రాలకు కూడా ఓఆర్‌ఆర్‌లను నిర్మించాలని గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం నగ రం చుట్టూ నాలుగు లేన్ల ఓఆర్ఆర్ను ప్రతిపాదించారు. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణం వెలుపల నుంచి మూడు వైపులా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది. ముఖ్యం గా నాగపూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేను ఖమ్మం మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు నిర్మిస్తున్నారు. దీనిని రూ.6,700 కోట్లతో ఎన్హెచ్ఏఐ నిర్మిస్తున్నది.
సూర్యాపేట-దేవరపల్లి హైవే కూడా ఖమ్మం మీదుగా వెళ్తున్నది. దీనిని రూ. 2,213.91 కోట్లతో ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు మరో జాతీయ రహదారిని నిర్మిస్తున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం నుంచి కుర వి వరకు మరో రహదారిని నిర్మిస్తున్నది. ఈ రోడ్లన్నీ ఖమ్మం నుంచి బైపాస్ కావడంతో నగరానికి మూడువైపులా నాలు గు లైన్ల జాతీయ రహదారులు ఏర్పడుతున్నాయి. వీటి అనుసంధానంతో ఓఆర్ఆర్ ఏర్పాటవుతుంది. రోడ్ల అనుసంధానంలో భాగం గా ఓఆర్ఆర్ను కొత్త కలెక్టరేట్ వెలుపలి నుంచి తనికెళ్లకు సమీపంలోని విజయ ఇంజినీరింగ్ కాలేజ్ మీదుగా నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. దీనికి బదులు అంతకుముం దు ప్రతిపాదించిన బల్లేపల్లి, ఖానాపురం హవేలీ మీదుగా నిర్మించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.