మామిళ్లగూడెం/ ఖమ్మం సిటీ, జూన్ 9: ఖమ్మం నగరంలో పన్నెండేండ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు.. బాలికను మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి తోసేశాడు. ఈ నెల 6న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్మెంట్ కింది అందస్తులో బాలిక కుటుంబం నివాసం ఉంటున్నది. అదే అపార్ట్మెంట్ పై అంతస్తులో నివాసముంటున్న నిందితుడు గౌస్ (57) బాలికపై కన్నేశాడు.
ఈ నెల 6న వారు నివసించే భవనం మీద సదరు బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. విషయం బయటకు రాకుండా చేసేందుకు ఆమెను అంతమొందించాలనుకొని, మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి తోసేశాడు. అయితే, భవనం కిందనే ఉన్న సదరు బాలిక తాత.. ఎవరో కింద పడిన శబ్దం విని పరుగున వెళ్లి చూశాడు. ఆమె తన మనవరాలే కావడంతో దిగ్భ్రాంతికి గురై గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ భవనంపైకి చూశాడు. అక్కడ గౌస్ కనిపించాడు. ఈలోపు అతడి కేకలు విని అక్కడికి వచ్చిన స్థానికుల సహాయంతో బాధిత బాలికను దవాఖానకు తరలించాడు.
ఆ బాలికకు వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగినట్టు తెలిసింది. బాలిక భవనంపై నుంచి కిందపడిన సమయంలో భవనంపై గౌస్ ఉండటం, అతడి ప్రవర్తన గతంలో కూడా ఇలాగే ఉండటం వంటి కారణాల నేపథ్యంలో బాధితురాలి తండ్రి ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు ఈ నెల 7న కేసు నమోదుచేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అత్యంత అమానుషమైన ఈ ఘటనపై బాధిత బాలిక సామాజికవర్గానికి చెందిన వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మామిళ్లగూడెం: ఖమ్మంలో 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి చేసి భవనం పైనుంచి కిందికి తోసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ బాలకృష్ణతో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 6న హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు. తాము సేకరించిన ఆధారాల ప్రకారం కార్ డ్రైవర్ ఎండీ గౌస్ (57) ఈ కేసులో నిందితుడని, అతడిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నదని, మిగిలిన వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఖమ్మంలో బాలికపై లైంగికదాడి అమానవీయం. విచారకరం. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే బాలిక కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి మాట్లాడాను. బాధితురాలికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బాధితురాలు దవాఖాన నుంచి పూర్తిగా కోలుకొని ఇంటికి చేరే వరకు మేమే ఉచిత వైద్యం అందిస్తాం.
– పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
ఖమ్మంలో బాలికపై దుర్మార్గుడు చేసిన లైంగికదాడి అమానుషం. ఆ బాలికను లైంగికంగా వేధించి హత్య చేసేందుకు కుట్ర పన్నిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలి. బాధితురాలికి మెరుగైన వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడాలి. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఇటువంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది.
-వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
బాలికపై లైంగికదాడికి ఒడిగట్టి, భవనం పైనుంచి ఆమెను కిందికి నెట్టేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టేలా ఉక్కుపాదం మోపాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి కఠిన శిక్షలు పడేలా పోలీసులు కేసు నమోదు చేయాలి. బాలిక కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
– నామా నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ