ఖమ్మం : ఎర్ర బంగారంగా పిలువబడుతున్న ఎండుమిర్చి ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. దీంతో రైతులు(Farmers) సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఎండు మిర్చి తేజ రకానికి(Teja variety chillies) రికార్డు స్థాయిలో ధర పలికింది.
గురువారం ఉదయం జెండాపాట సమాయానికి వివిధ జిల్లాల నుంచి 26 వేల బస్తాల మిర్చిని రైతులు యార్డుకు తీసుకొచ్చారు. అనంతరం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠ ధర రూ.23 వేలు పలికింది. మధ్య ధర క్వింటాకు రూ.20,900 కాగా, కనిష్ఠ ధర క్వింటాకు రూ18,300 చొప్పున వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. తాలు రకం పంటకు క్వింటా రూ.14 వేలు పలికింది .
యార్డులో జెండాపాట నిర్వహణ, క్రయవిక్రయాల తీరును చైర్పర్సన్ దోరెపల్లి శ్వేత, సెక్రటరీ ఆర్ మల్లేశం పరిశీలించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే యార్డులో క్వింటా మిర్చి ధర రూ.25 వేలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ కమిటీ వ్యాపారులు వెల్లడించారు.